మరో రెండేళ్ల పాటు నిమిషానికి ఆరు పైసలు చార్జీలు చెల్లించక తప్పదా?

నిన్న కాక మొన్న రిలయన్స్ జియో ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీల పేరిట బయట నెట్వర్క్లకు చేసే కాల్స్ నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది అని బాంబు పేల్చిన విషయం తెలిసిందే.


అయితే అందులో 2017లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ జనవరి 1 2020 నుండి TRAI IUC ఛార్జీలను పూర్తిగా ఎత్తి వేస్తున్న నేపథ్యంలో కేవలం అప్పటి వరకు మాత్రమే వినియోగదారులు బయట నెట్వర్క్లకు చేసే కాల్స్ నిమిషానికి ఆరు పైసలు చెల్లించాల్సి ఉంటుంది అని రిలయన్స్ జియో ప్రకటించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అనేక మంది రిలయన్స్ జియో వినియోగదారులను కదిలించినప్పుడు కూడా ఇంకా కేవలం మూడు నెలలే కదా, ఇన్నాళ్లు ఫ్రీగా ఫోన్ కాల్స్ చేసుకున్నాం. మరో మూడు నెలలు ఆగ లేమా అనే అభిప్రాయం వ్యక్త పరిచారు.


అయితే ఈ పరిస్థితి కేవలం తాత్కాలికం అని భావించే వారికి ఇప్పుడు మరో దుర్వార్త. 2017 లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అప్పటివరకు ఉన్న నిమిషానికి 14 పైసల నుండి ఆరు పైసలు IUC ఛార్జీలు తగ్గించిన సమయంలో పేర్కొన్న విధంగా జనవరి 1 2020 నుండి అలాంటి మార్పు ఏది వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.


TRAIలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం 2022 వరకు IUC ఛార్జీలను ఎత్తివేసే ఆలోచనలో TRAI ఏ మాత్రం లేదు. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా ఉచిత కాల్స్ ఆస్వాదిస్తున్న వారు ఇక మీదట ఫోన్ కాల్స్ కి డబ్బులు చెల్లించక తప్పదు.


కేవలం రిలయన్స్ జియో మాత్రమే కాదు, అతి త్వరలో Airtel, Vodafone Idea వంటి సంస్థలు కూడా బయట నెట్వర్క్లకు చేసే కాల్స్ విషయంలో నిమిషానికి 6 పైసలు వసూలు చేసే ఆలోచనలో ఉన్నాయి. రిలయన్స్ జియో కారణంగా ఆర్థికంగా ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్న టెలికం సంస్థలకు ఈ తాజా పరిణామం కొంత ఆర్థికంగా ఊరటనిస్తుంది అనడంలో సందేహం లేదు.


ఇదిలా ఉంటే వినియోగదారులు మామూలు ఫోన్ కాల్స్ పక్కనపెట్టి ఇక పూర్తిస్థాయిలో వాట్స్అప్ కాల్స్, లేదా ఇతర వాయిస్ ఓవర్ ఐపి నెట్వర్క్ల ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవటమే శరణ్యంగా కనిపిస్తోంది. అలాంటి సందర్భాల్లో కూడా నెట్వర్కు క్వాలిటీ లేకపోతే ఇబ్బందులు తప్పవు. టెలికం సంస్థలు మౌలిక సదుపాయాల పరంగా కూడా మరింత దృష్టి పెట్టక తప్పదు.